తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి 

ఉత్పాదక వ్యయం, నాణ్యత, సామర్థ్యం విషయంలో దేశీయ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని, దీని కోసం మనమంతా కలిసికట్టుగా శ్రమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి వేగంగా, విస్తృతంగా కృషి చేయాలని కోరారు. 

తయారీ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. దీని కోసం తన ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. ఉత్పాదకతతో అనుసంధానమైన ప్రోత్సాహక పథకాల గురించి పారిశ్రామికవేత్తలతో శుక్రవారం జరిగిన వెబినార్‌లో మోదీ మాట్లాడారు.

గడచిన 6-7 సంవత్సరాల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ను ప్రోత్సహించేందుకు విజయవంతంగా కృషి చేసినట్లు తెలిపారు. మన దేశంలో తయారీ రంగం అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడాలని చెప్పారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన’పై తన ప్రభుత్వం దృష్టి పెట్టిందని పేర్కొంటూ  మాన్యుఫ్యాక్చరింగ్ రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని మార్చుతుందని, అనేక అంశాలతో సహజీవనం చేయగలిగే వ్యవస్థను సృష్టిస్తుందని చెప్పారు.

 మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యం పెరిగితే, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతూ  దీనికి ప్రపంచంలో అనేక దేశాలు ఉదాహరణగా నిలుస్తున్నట్లు వివరించారు. భారత దేశం కూడా ఇదే వైఖరితో ముందుకెళ్తోందని, తన ప్రభుత్వం ఈ రంగంలో ఒకదాని తర్వాత మరొక సంస్కరణను అమలు చేస్తోందని చెప్పారు. 

తన ప్రభుత్వ విధానం, వ్యూహం ప్రతి విషయంలోనూ చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. తయారీ రంగం వల్ల పర్యావరణంపై దుష్ప్రభావాలు పడకుండా, ఎటువంటి లోపాలు లేని ఉత్పత్తులు తయారు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే విధంగా మన దేశ తయారీ రంగం శ్రమించాలని కోరారు.

మన ఉత్పాదక వ్యయాలు, నాణ్యత, ఉత్పత్తుల సమర్థత అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును సాధించాలన్నారు. దీని కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మన దేశ ఉత్పత్తులు తప్పనిసరిగా వాటిని ఉపయోగించేవారికి అత్యంత అనుకూలంగా, అత్యాధునికంగా, అందుబాటు ధరల్లో, స్థిరంగా నిలబడగలిగే విధంగా ఉండాలని చెప్పారు.

ప్రతిదానిలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల పరిష్కారాలు లభించడం కన్నా మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని తన ప్రభుత్వం నమ్ముతోందని ప్రధాని స్పష్టం చేశారు. అందుకే తాము స్వీయ నియంత్రణ, స్వీయ ధ్రువీకరణ, స్వీయ నిర్థరణలను నొక్కి వక్కాణిస్తున్నట్లు తెలిపారు. 

దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. కేంద్ర బడ్జెట్, విధాన నిర్ణయాలు కేవలం ప్రభుత్వ ప్రక్రియగా మిగిలిపోకూడదని పేర్కొన్నారు. దేశాభివృద్ధితో సంబంధం ఉన్నవారంతా దీనిలో సమగ్రంగా పాలుపంచుకోవాలని సూచించారు.