హైదరాబాద్ లో 54 శాతం మందికి యాంటీ బాడీస్

హైదరాబాద్ లో 54 శాతం మందికిఇప్పటికే కరోనా వచ్చిపోయిందని సీసీఎంబీ, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్, భారత్ బయోటెక్ లు సంయుక్తంగా నిర్వహించిన సెరోలాజికల్ సర్వేలో వెల్లడైంది. 9 వేల శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 54 శాతం మందిలో ఇప్పటికే  కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

నగరంలోని 30 వార్డుల్లో ప్రతీ వార్డు నుంచి 300 శాంపిల్స్ సేకరించారు. వీరంతా పదేళ్లు పైబడిన వాళ్లే. 9 వేల మందిలో 10 శాతం మంది ఇప్పటికే  కరోనా వచ్చి తగ్గిపోయినవాళ్లు కూడా ఉన్నారు. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. కొన్ని వార్డుల్లో 70 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించగా; మరికొన్ని వార్డుల్లో 30శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి.

పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లో యాంటీబాడీలు కనిపించాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. 56 శాతం మహిళల్లో యాంటీబాడీలుంటే, 53 శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. 70 ఏళ్లు పైబడిన వారిలో తక్కువగా యాంటీబాడీలున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇంట్లో కరోనా వచ్చిపోయిన వారు ఎవరైనా ఉంటే  ఆ కుటుంబసభ్యుల్లో 78 శాతం యాంటీబాడీలు డెవలప్ అయ్యాయని పేర్కొన్నారు. బయట కరోనా వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారిలో 68 శాతం యాంటీబాడీలున్నట్టు గుర్తించారు. అయితే..  చాలామందిలో యాంటీబాడీలు కనిపించినా, వీరిలో చాలామంది కి కరోనా వచ్చిన విషయమే తెలియదని సర్వేలో తేలింది.