కేరళ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. 
 
టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు. మరోవైపు గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. 
 
శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘ఈ వేషధారణలో ఉండడం ఇదే చివరి రోజు. ఇది ఢిల్లీ మెట్రో రైల్ యూనిఫాం. ఇదో విలక్షణమైన యూనిఫాం.’’ అని శ్రీధరన్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమని, కేరళ అభివృద్ధికి తన నాయకత్వం అవసరమని ఫిబ్రవరి 19న శ్రీధరన్‌ పేర్కొన్నారు. 
 
కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడవేయడంతో పాటు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కేరళలో యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని అందుకే తాను కాషాయ పార్టీలో చేరానని శ్రీధరన్‌ చెప్పుకొచ్చారు.