సై‌‌నిక్ స్కూళ్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు

డెబ్భై ఏండ్ల స్వాతంత్ర్య దేశ చరిత్రలో తొలిసారిగా మోడీ సర్కారు న్యాయబద్ధంగా బీసీ రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ​ కె.లక్ష్మణ్​ తెలిపారు. సైనిక్  స్కూళ్లలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. 

లక్ష్మణ్​ నేతృత్వంలోని ఓబీసీ బృందం ​ఆదివారం ఢిల్లీలో రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయింది. దేశవ్యాప్తంగా కొత్త సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై వారు చర్చించారు. తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ సైనిక్  స్కూళ్లలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఆ దిశగా చర్యలు తీసుకున్న రాజ్ నాథ్ సింగ్ కు అభినందనలు తెలిపామని వివరించారు. 

సైనిక్  స్కూళ్లలో చదువుకున్న వారికి త్రివిధ దళాల్లో ఉన్నత పదవుల్లో దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 133 సైనిక్ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందని, దాదాపు 5 వేల మంది వెనకబడిన వర్గాల పిల్లలకు ఆ స్కూళ్లలో అవకాశం ​ రానుందని తెలిపారు.

కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూళ్లు, లా యూనివర్సిటీల్లో ఓబీసీలకు ఈ ఏడాది 27 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నట్టు చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 60 వేల మంది బీసీ విద్యార్థులకు  ప్రయోజనమని చెప్పారు.

వెనుకబడ్డ వర్గాల్లోనూ కొన్ని కులాలకు ఎక్కువ రిజర్వేషన్లు అందుతున్నాయని.. అందువల్ల చిన్న చిన్న కులాలు, సంచార జాతులకూ రిజర్వేషన్లు అందేలా వర్గీకరణ కోసం కేంద్రం జస్టిస్ రోహిణి కమిషన్ ను ఏర్పాటు చేసిందని చెప్పారు. త్వరలోనే ఆ కమిషన్  కేంద్రానికి నివేదిక  సమర్పించనుందని పేర్కొన్నారు.

ఏడేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం  వెనుకబడిన వర్గాల కోసం ఎంతో చేసిందని చెప్పారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్​వర్డ్ క్లాసెస్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. ఓబీసీల అభ్యున్నతి కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బీసీలను సంఘటితం చేస్తామని తెలిపారు.