గోవుల తరలింపుపై శంషాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత

గోవుల తరలింపుపై శంషాబాద్‌ పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గోవులను కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని గోవుల తరలింపును అడ్డుకున్నారు. 

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో పాలమాకుల గ్రామంలో ఉన్న గోశాలకు గోవులను బజరంగ్‌దళ్ కార్యకర్తలు తరలించారు. అయితే పట్టుకున్న గోవులను విడిపించడానికి గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులకు మద్దతుగా ఓ కౌన్సిలర్ భర్త వచ్చి బజరంగ్‌దళ్ కార్యకర్తలతో గొడవ పెట్టుకున్నాడు.

ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో పట్టణంలో కాసేపు  ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. శంషాబాద్ పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

కాగా, సిద్దిపేట జిల్లాలో సంచలనం స‌ృష్టించిన గోవధ కేసు విచారణకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ ‘సిట్’ను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్  జోయల్ డేవిస్ తెలిపారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 6 మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ రోజు నుంచి సిట్ బృందం కేసు పరిశోధనను ప్రారంభించనున్నట్లు సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.  సిద్దిపేట శివారు సిరిసిల్ల వెళ్లే బైపాస్  రోడ్డుకు కొద్ది దూరంలో జుబేర్ ‌కోళ్లఫారం షెడ్డులోలో గోవధ సంఘటనలో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సిద్దిపేటలో శుక్రవారం రాత్రి గోవుల వధ కలకలం సృష్టించిన విషయం తెలిసిదే. పుల్లూరు రోడ్డులోని కోళ్లఫారం షెడ్డులో కబేళా నిర్వాహకులు 18 గోవులను వధించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన  సిద్దిపేటకు చెందిన జుబేర్, ఖాజా, సద్దాం, అరాఫత్, ఇబ్రహీం, హర్షద్, ఆరాఫ్, జావిద్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

గోవధ ఘటనపై  ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, గోవులను తరలించిన వాహనాలను సీజ్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘటనా స్థలిలో మిగిలిన గోవులను సిద్దిపేటలోని గోశాలకు తరలించాలని అధికారులకు సూచించారు.