తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో కొత్త వైరస్ 

ఆంధ్ర ప్రదేశ్ లో  మళ్లీ కరోనా భయం మొదలైంది. జనవరి తరువాత రాష్ట్రంలో రోజువారీ నమోదయ్యే కేసులు సంఖ్య తగ్గుతున్నా గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో మళీ కేసులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారివల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. 

ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో కొత్త రకం వైరస్‌ వెలుగులోకి రావడం, దాని ప్రభావం తీవ్రంగా ఉండటంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో కేసుల సంఖ్య పెరగుతోంది. ఈ రాష్ట్రాల్లోనే కొత్త రకం వైరస్‌ కూడా బయటపడింది.

తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహరాష్ట్రల్లో కరోన ఎన్‌ 440కె, ఇ 484కె రకం కేసులు నమోదయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేసేందుకు విమానాశ్రయాలు, బస్టాండ్లలో థర్మల్‌ స్కానింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవంక, రాష్ట్రంలో మరో పది రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. నాయకులు, కార్యకర్తలంతా ఆ హడావుడిలో ఉన్నారు. వేలాది మంది కలిసి ప్రచారార్భాటాల్లో మునిగి తేలుతున్నారు. సామాన్య ప్రజలు కూడా కరోనాను పట్టించుకోకుండా ఎవరి పని వారు నిమగమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు వస్తే అమలు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.