పరిహారం లేకుండానే పోలవరం నిర్వాసితుల తరలింపు

పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేసిన తర్వాతే నిర్వాసితులను ఖాళీ చేయించాలని 2008 భూసేకరణ స్పష్టం చేస్తున్నా, అందుకు భిన్నంగా వారిని తరలించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.  పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యి పది రోజులు కూడా కాకుండానే, ఎన్నికైన సర్పంచులు ఇంకా బాధ్యతలు సైతం చేపట్టకుండానే అందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 
పశ్చిమ గోదావరి జిల్లా  కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 25 గ్రామాల్లోని 6,693 కుటుంబాలు ఏప్రిల్‌, మే నెలాఖరుకల్లా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. పోలవరం స్పిల్‌వే గేట్లు, కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా 41.15 కాంటూరు ఎత్తులో ముంపునకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలు ఖాళీ చేయాలంటూ శనివారం దండోరా సైతం వేయించారు.
ఈ కాంటూరు పరిధిలో వేలేరుపాడు మండలంలోని 17 గ్రామాల్లో 3,719 కుటుంబాలు, కుక్కునూరు మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 2,977 కుటుంబాలు ఉన్నాయి. నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించకుండా, పునరావాస ప్యాకేజీ, భూములకు, యువతకు పరిహారం, మిగులు భూములకు పరిహారం ఇవ్వకుండా తమను గ్రామాల నుంచి ఖాళీ చేయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10.50 లక్షల పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు. 2006లో ఎకరా 1.15 లక్షలకే సేకరించిన భూములకు తాము అధికారంలోకి వస్తే రూ.ఐదు లక్షల చొప్పున ఇస్తామని వైసిపి ప్రకటించింది. అధికారంలోకొచ్చి రెండేళ్లు కావస్తోన్నా ఈ హామీ అమలుకు నోచుకోలేదు.
కుక్కునూరు మండలంలో దాదాపు 600 ఎకరాలకు, వేలేరుపాడు మండలంలో 1200 ఎకరాల వరకూ ప్రభుత్వం ప్రకటించిన రూ.ఐదు లక్షల పరిహారం అందాల్సి ఉంది. 18 ఏళ్లు నిండిన యువతకు ఇస్తామన్న ప్యాకేజీ సైతం ఇవ్వలేదు. ఇళ్లకు, చెట్లకు ఇవ్వాల్సిన పరిహారం సొమ్ముకు ఇప్పటి వరకూ అతీగతీ లేదు. మిగులు భూములకు సంబంధించి పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో న్యాయం చేశాకే గ్రామాలను ఖాళీ చేస్తామని నిర్వాసితులు తేల్చి చెపుతున్నారు.