ఉగాది నుంచి తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ‌లు

ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14 ఉది  నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు నిర్ణయించింది. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించారు. 2021 – 22  వార్షిక‌ బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్   వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏక రూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం. ఇప్ప‌టికే ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని నిర్ణయహించారు.

దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలల్లో వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించారు. 

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని నిర్ణయించాయిరు. తిరుమలలోని రెస్ట్ హౌస్‌లు, సత్రాలు, కాటేజీల్లో విద్యుత్ వృథాను నియంత్రించడానికి ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. 

కాగా శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని చేసిన బోర్డు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు ఆలయ తులాభారం ఏర్పాటుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. 

శ్రీనివాస మంగాపురంలో అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం తెలిపారు. తద్వారా నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు.