బోధన్ లో మరో  80 నకిలీ పాస్‌పోర్టులు 

బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం మొదలైంది. బోధన్‌ పోస్టాఫీసుకు కొత్తగా మరో 80 నకిలీ పాస్‌పోర్టులు వచ్చాయి. షర్బత్‌ కెనాల్‌లోని నాలుగు ఇళ్ల అడ్రస్‌లపై ఈ పాస్‌పోర్టులు ఉన్నాయి. అవి తప్పుడు పాస్‌పోర్టులని గుర్తించిన పోస్టల్‌ సిబ్బంది డోర్‌లాక్‌ పేరుతో వాటిని వెనక్కు పంపేశారు. రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు నుండి అవి వచ్చినట్లు తపాలా శాఖ అధికారులు చెబుతున్నారు.
 
కాగా, బోధన్‌ కేంద్రంగా నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి ఇప్పటికే 72 మంది బంగ్లాదేశీయులు పొందిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇప్పటికే 8 మంది అరెస్ట్‌ అయ్యారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ అవే అడ్రస్‌లకు నకిలీ పాస్‌పోర్టులు రావటంతో పోలీస్ శాఖలో టెన్షన్ మొదలైంది. 
మరోవంక, నకిలీ పాస్‌పోర్ట్ వ్యవహారంపై ఒకవైపు స్థానిక పోలీసులు విచారణ సాగిస్తున్న క్రమంలో మరోవైపు ఎన్‌ఐఎ అధికారులు దృష్టిసారించారు. నకిలీ పాస్‌పోర్ట్‌ల వ్యవహారం దేశ భద్రతకు సంబంధించినది కావడంతో నకిలీ పాస్‌పోర్ట్‌ల జారీపై ఎన్‌ఐఎ రంగం ప్రవేశం చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్ పట్టణంలో బంగ్లాదేశ్ మూలాలున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. 
 
బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు అక్రమార్జన కోసం నికిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసరా పింఛన్లు, భూముల దస్తావేజులు, రుణాలు పొందేందుకు బ్యాంకులకు సమర్పించే పత్రాలను నకిలీవి తయారు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
తాజాగా పాస్‌పోర్ట్‌లు పొందడానికి బోగస్ ఆధార్ కార్డులను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈక్రమంలో బంగ్లాదేశీయులు సులభంగా పాస్‌పోర్టులు పొందేందుకు బోధన్ పట్టణాన్ని కేంద్రంగా ఎంచుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు రికార్డులో ఉన్న ఐఎస్‌ఐ సానుభూతిపరులు, మాడ్యువల్స్ కదలికలపై పోలీసులు, ఎన్‌ఐఎ అధికారులు సంయుక్తంగా నిఘా సారిస్తున్నారు.