రాహుల్ పై సీనియర్ నేతల ధిక్కార ధోరణి 

రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార తీరుతెన్నులు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏ అవకాశం లభించినా తమ అసంతృప్తిని, ధిక్కార ధోరణిని ప్రదర్శించడానికి వెనుకాడటం లేదు. కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన జీ-23 కాంగ్రెస్‌ నేతలు మరోసారి సమావేశమయ్యారు. ఈసారి గులాం నబీ ఆజాద్‌ను కలిసేందుకు అన్నది సాకుగా వీరు శనివారం నాడు జమ్ములో భేటీ అయ్యారు.
 
కేరళ ఎన్నికల సభలో ఉత్తరం-దక్షిణం అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ జీ-23 నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తున్నది. రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే వీరంతా జమ్ములో సమావేశం కావడం విశేషం. దేశం మొత్తం మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఇలా ఉత్తరం-దక్షిణం అంటూ విభజిస్తూ ఆపాదించడం ఏమాత్రం బాగోలేదని జీ-23 నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. 
 
‘జమ్ముకశ్మీర్‌ కావొచ్చు.. లడఖ్‌ కావొచ్చు.. మరో ప్రాంతమైనా.. ఏ మతమైనా.. మేం అందరినీ సమానంగా గౌరవిస్తాం. అతే మా బలం. ఇదే విధానాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాం’ అని సమావేశంలో ఆజాద్‌ కాస్తా ఘాటుగానే చెప్పారు. 

రానూ రానూ కాంగ్రెస్ బలహీనపడుతోందని అంటూ పార్టీ సీనియర్ నేతలు మరోమారు పార్టీ నాయకత్వం తీరు పట్ల తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.  ఈ భేటీకి గులాం నబీ ఆజాద్‌ ఆతిథ్యం ఇవ్వగా.. కపిల్‌ సిబ్బల్‌, మనీష్‌ తివారి, ఆనంద్‌ శర్మ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, నటుడు రాజ్‌బబ్బర్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా  మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్న సత్యాన్ని గ్రహించాలని, అందుకే తాము ఇక్కడ కలిసినట్లు తెలిపారు. గతంలోనూ ఇలాగే కలిశామని, అందరం కలిసి పార్టీని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటని తెలిసిన ఏకైక వ్యక్తి ఆజాద్ అని పేర్కొంటూ ఎంపీగా పదవీ విరమణ పొందుతున్నారని తెలుసుకొని ఎంతో బాధపడ్డామని పేర్కొన్నారు.  ఇంత అనుభవం ఉన్న నేత సేవలను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవట్లేదో తమకు ఏమాత్ర అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. 

 విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంలో పైలట్‌తో పాటు ఇంజినీర్ కూడా అవసరమని, ఆజాద్ పార్టీలో ఓ ఇంజినీర్ పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని, ఆయన ఓ ఇంజినీర్ అని సిబాల్ కొనియాడారు. 

కాంగ్రెస్ అందర్నీ గౌరవిస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. జమ్మూ వారైనా, కశ్మీర్ వారైనా, లడఖ్ వారైనా… తాము అందర్నీ గౌరవిస్తామని, అన్ని జాతుల వారినీ గౌరవిస్తామని తెలిపారు. అందర్నీ గౌరవించడమే తమ బలమని, దానిని అలాగే కొనసాగిస్తామని ఆజాద్ హామీ ఇచ్చారు.

‘‘మేమంతా జి-23 నేతలని ప్రజలంటున్నారు. నా మట్టుకైతే మేమంతా గాంధీ 23 అని అనుకుంటాం. గాంధీ ఆలోచనలతోనే చట్టం, రాజ్యాంగం రూపొందించబడింది. మేమంతా  కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లడానికే ఉన్నాం. ఈ మధ్యనే ఎంపీగా ఆజాద్ పదవీ విరమణ పొందారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా కన్నీరు కార్చారు’’ అని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు.

‘‘చాలా కష్టపడి మేం ఈ స్థాయికి వచ్చాం. దొడ్డిదారిన రాలేదు.  అందరమూ విద్యార్థి రాజకీయాలను చేశాం. అందులోంచే ఇంత ఎదిగాం. మేం కాంగ్రెస్ మనుషులమే. కాంగ్రెస్ మనుషులం కాదనే హక్కు ఎవరికీ లేదు. మేం పార్టీని నిర్మించాం. మేమే పటిష్ఠం చేశాం. మేం ఐక్యతనే నమ్ముతాం” అంటూ ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. 

కొన్ని రోజులుగా కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ పార్టీని పటిష్ఠం చేయడానికే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. దేశమంతా  పార్టీ మరోసారి పటిష్ఠం కావాలని, నూతన తరాన్ని కాంగ్రెస్‌తో అనుసంధానించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వచ్చే మంచి రోజులను తాము కళ్లారా చూడాలని భావోద్వేగంతో చెప్పారు.