పండగలు, కరోనా దృష్ట్యా బెంగాల్‌లో 8 విడతలు 

పండగలు, కరోనా ప్రోటోకాల్స్‌ దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో జరపాలని నిర్ణయించామని ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్‌ అరోరా తెలిపారు. భద్రతా బలగాల కేటాయింపు, కరోనా కేసులు అధికమవుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
 
శాంతి భద్రతల పరిస్థితులను అంచనా వేయడంతో పాటు పలు అంశాలపై ఆధారపడి కమిషన్‌ నిర్ణయాలు తీసుకుంటుదని ఆరోరా పేర్కొన్నారు. రాష్ట్రంలో 2016 ఎన్నికలు ఏడు విడతలలో జరిగాయని గుర్తు చేశారు. 
 
రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు, ఆరోపణలు దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఇదేమీ పెద్ద విషయం కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఇద్దరు అధికారులను తమిళనాడుకు, మరో ఇద్దరు పోలీస్‌ అధికారులను పశ్చిమబెంగాల్‌కు పంపుతున్నామని చెప్పారు.  
 
బెంగాల్‌కు రిటైర్డ్ పోలీస్ అధికారులు వివేక్ దుబే, ఎంకే దాస్‌లను పరిశీలకులుగా కూడా ఈసీ నియమించింది. 2016లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నాటి నుండి కౌంటింగ్‌ ముగిసే వరకు 77 రోజులు పట్టిందని, ప్రస్తుతం 66 రోజులకు కుదించినట్లు చెప్పారు.
 
 కాగా, ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు సూచించారా అని ఆమె ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదని టీఎంసీ నేత సౌగత్ రాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.