భారత్‌, చైనా మధ్య కమ్యూనికేషన్‌ హాట్‌లైన్

కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలని భారత్‌, చైనా విదేశాంగమంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి మధ్య జరిగిన ఫోన్‌కాల్‌ సంభాషణలో నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది రేగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో సకాలంలో కమ్యూనికేషన్‌ వుండాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, సకాలంలో, సరైన పద్దతిలో పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించినట్లు తెలిపింది.

చైనా విదేశాంగ శాఖ కూడా విడిగా మరో ప్రకటనలో ఇదే విషయాన్ని తెలిపింది. ప్రస్తుతమున్న మిలటరీ హాట్‌లైన్‌కు అదనంగా ఈ కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ వుంటుంది. గురువారం ఇరుదేశాల మంత్రులు 75 నిముషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఇరు దేశాల సంబంధాలకు చెందిన అంశాలను చర్చించారు. సరిహద్దు సమస్య పరిష్కారం కావడానికి కొంత సమయం పట్టవచ్చునని, కానీ హింసతో సహా శాంతి భద్రతల ఉల్లంఘనలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని కనపరుస్తాయని జైశంకర్‌ పేర్కొన్నారు.

సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడాలంటే ముందుగా ఉద్రికత్తలు తగ్గాలని, సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ జరగాలని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ పరిస్థితులను కొనసాగించడానికి ఉభయపక్షాలు తీర్మానించాయని, ప్రస్తుతమున్న ఫలితాలు మరింత సంఘటితమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఈ సంప్రదింపుల క్రమాన్ని కొనసాగిస్తామని వాంగ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.