అమెరికా దాడుల్లో 17 మంది ఇరాన్ మిలిటెంట్ల మృతి 

సిరియాలోని కొన్ని స్థావ‌రాల‌పై ఇవాళ అమెరికా ద‌ళాలు జరిపిన  వైమానిక దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైట‌ర్లు మృతిచెందారు.  ఇరాన్ మ‌ద్ద‌తు ఇచ్చే మిలిటెంట్ల స్థావ‌రాల‌పై దాడులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల ఇరాక్‌లోని అమెరికా ద‌ళాల‌పై మూడు వేర్వేరు రాకెట్ దాడులు జ‌రిగాయి. దానికి ప్ర‌తీకారంగా అమెరికా తాజా రాకెట్ దాడులు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.  అధ్య‌క్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాల‌తోనే ఇరాన్‌ మిలిటెంట్ల‌పై దాడులు జ‌రిగాయి.

ఇటీవ‌ల ఇరాక్‌లోని ఇర్బిల్‌లో జ‌రిగిన దాడికి షియా మిలిటెంట్లు కార‌ణ‌మ‌ని అమెరికా అధికారులు భావిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో అమెరికా ర‌క్ష‌ణ కార్యాల‌యంలో పెంట‌గాన్ ఈ తాజా దాడుల‌కు పూనుకున్న‌ది.

సిరియా-ఇరాక్ బోర్డ‌ర్‌లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై దాడులు చేసిన‌ట్లు పెంటటాన్ అధికారులు తెలిపారు. అధ్య‌క్షుడు బైడెన్ ఆదేశాల ప్ర‌కారం ఈస్ట్ర‌న్ సిరియాలోని స్థావ‌రాల‌పై దాడి చేసిన‌ట్లు పెంట‌గాన్ ప్ర‌తినిధి జాన్ కిర్బీ తెలిపారు.

సిరియా న‌గ‌ర‌మైన బుకామ‌ల్ వ‌ద్ద ఇరాక్ నుంచి వ‌స్తున్న మూడు ట్ర‌క్కుల‌పై దాడి జరిగింది. ఆ వైమానిక దాడుల్లో 17 మంది మృతిచెందిన‌ట్లు సిరియా అబ్జ‌ర్వేట‌రీ ఫ‌ర్ హ్యూమ‌న్ రైట్స్ పేర్కొన్న‌ది.  వైమానిక దాడిలో హ‌షీద్ అల్ సాబీ ద‌ళ స‌భ్యులు మృతిచెందారు. ఆ ద‌ళానికి ఇరాన్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.