న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు 

న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు 

న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మందలించింది. సరైన స్ఫూర్తితో అమలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కారాగారాల్లో ఉన్న ఖైదీలకు పనికి ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

న్యాయస్థానం ఆదేశాల పట్ల అధికారులకు గౌరవం ఉండాలని హితవు చెప్పింది కోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.

ఖైదీలకు న్యాయబద్ధమైన వేతనం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ 2019లో న్యాయవాది తాండవ యేగేశ్‌ పిల్‌ దాఖలు చేశారు. ఖైదీల వేతనానికి సంబంధించి 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం నైపుణ్యం, సగం నైపు ణ్యం ఉన్న, నైపుణ్యం లేనివారిగా విభజించి రూ.30, రూ.50, రూ.70 వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 

ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా… వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇస్తుందని వారం గడువు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం 2వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణ నాటికి జీవోను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. 

ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా, పరిపాలనా జాప్యం వల్ల ఉత్తర్వులు సమర్పించలేకపోతున్నామని, విచారణను సోమవారానికి వాయిదావేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఆ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమర్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత విచారణలో వారం సమయం అడిగితే, 14 రోజుల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పనికి ప్రోత్సాహకాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చి, ఆ జీవోను సాయంత్రం 4గంటలకు కోర్టు ముందుంచాలని, విఫలమైతే బాధ్యులైన అధికారులు కోర్టుముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

సాయంత్రం విచారణ ప్రారంభమైన వెంటనే జీవోను ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు ఇచ్చిన హామీలకు అధికారులు విలువ ఇచ్చేలా చూడాలని ఏజీకి కోర్టు సూచించింది.