సంగమేశ్వరంపై నిర్ణయం తీసుకోండి

సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతోందన్న తెలంగాణ ఫిర్యాదుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ) ఆదేశించింది. ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తోందని నారాయణపేట్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ జరిపింది. 

ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌‌‌‌‌, టెక్నికల్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ సైబల్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ గుప్త ఆధ్వర్యంలోని  బెంచ్‌‌‌‌‌‌‌‌ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా వాదనలు విన్నది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ వెంకట రమణి వాదనలు వినిపిస్తూ.. ‘‘రాయలసీమ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం పనులు చేయడం లేదని ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ ప్రమాణం చేసి అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం సోర్సు మార్పుపై స్టడీ చేస్తున్నాం. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం. అంతే తప్ప ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదు” అని చెప్పారు.

కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ తరఫు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతలపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని కోరారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జోక్యం చేసుకొని  ప్రాజెక్టు పనులు చేస్తున్న ఫొటోలు ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ముందు ఉంచినట్లు చెప్పారు. 

ఎన్‌‌‌‌‌‌‌‌జీటీ జ్యుడిషియల్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ పనులు జరుగుతున్నట్టుగా పిటిషనర్‌‌‌‌‌‌‌‌ ఫొటో సాక్ష్యాలు సమర్పించినా, సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు డీపీఆర్​ రూపొందించేందుకే ఇన్వెస్టిగేషన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామన్న ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చలేమని స్పష్టం చేశారు. 

ప్రాజెక్టు పనులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నట్టుగా కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ తేల్చితే అప్పుడు మళ్లీ ఎన్‌‌‌‌‌‌‌‌జీటీకి రావాలని పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు సూచిస్తూ కేసు విచారణ ముగిస్తున్నట్టుగా ప్రకటించింది.