అభివృద్ధి కావాలో… అవినీతి కల్చర్‌ కావాలో తేల్చుకోండి!

అభివృద్ధి కావా లో… అవినీతి, కట్‌ మనీ కల్చర్‌ కావాలో తేల్చుకోండి అని పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా పిలుపిచ్చారు. ఆయన గురువారం బెంగాల్‌లో లోఖో సోనార్‌ బంగ్లా (బంగారు బెంగాల్‌ నిర్మాణం) సన్నాహక కార్యక్రమంలో పాల్గొంటూ బెంగాల్‌ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

బెంగాల్‌లో జన్మించిన మహామహులకు గుర్తింపు లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. మహిళలు, యువత, మాతువా వర్గం సామాజిక, ఆర్థిక సాధికారతే ధ్యేయంగా తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని నడ్డా వెల్లడించారు. రాష్ట్రంలో కట్‌ మనీ, సిండికేట్‌ సంస్కృతికి చరమ గీతం పాడుతామని తేల్చిచెప్పారు. 

లోఖో సోనార్‌ బంగ్లా కార్యక్రమం మార్చి 3 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని, 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 కోట్ల మందికిపైగా ప్రజలను నేరుగా కలుస్తామని, బీజేపీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) రూపకల్పన కోసం వారి నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని నడ్డా వెల్లడించారు.  

పూర్తి జ్ఞానం తమకు ఉందని అనుకోవడం లేదని, అందుకే సామాన్య ప్రజల వద్దకు వెళ్తున్నామని బిజెపి అధినేత తెలిపారు. బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి, బొగ్గు దొంగతనం, సిండికేట్‌రాజ్, కట్‌ మనీ సంస్కృతి నుంచి బెంగాల్‌కు విముక్తి కలిగిస్తామని  భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు బెంగాల్‌ను నాశనం చేశాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం) కావాలని నడ్డా స్పష్టం చేశారు.