భారత్ నుండి విడిపోయిన భూగాలు మళ్ళి కలవచ్చు!

ధర్మానికి కేంద్ర బిందువైన భారత్‌ నుంచి విడిపోయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడినా నేటివరకు అశాంతి, అలజడితోనే ఉన్నాయని పేర్కొంటూ  దేశం నుండి విడిపోయిన భూభాగాలు భవిష్యత్తులో తిరిగి భారత్‌లో కలవవచ్చని  రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్  విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్  ద్విస‌హ‌స్రావ‌ధాని మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ ర‌చించిన విశ్వ‌భార‌తం గ్రంథ ఆవిష్క‌ర‌ణ సభలో పాల్గొంటూ దేశవిభజన ఎన్నటికీ కాదని జవహర్ లాల్ నెహ్రూ మొదలైనవారు ఎంత గట్టిగా చెప్పిన చివరికి దానిని తప్పించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు.  లోక కల్యాణం కోసం అఖండ భారత్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మంతోనే ఆ కల సాధ్యమవుతుందని తెలిపారు. 
. ‘‘ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండి, వేరైన దేశాలు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకప్పటి గాంధార దేశం అఫ్ఘానిస్థాన్‌గా మారింది. అక్కడ శాంతి ఉందా? పాకిస్థాన్‌ ప్రశాంతంగా ఉందా? భారత్‌ నుంచి విడిపోయిన దేశాలేవీ ప్రశాంతంగా మనుగడ సాగించడం లేదు. ఆ దేశాలు కష్టాల నుంచి బయట పడాలంటే తిరిగి భారత్‌లో ఏకం కావాలి. ఇది బలవంతంగా జరగరాదు. మానవ ధర్మం (హిందూ ధర్మం) ప్రకారం జరగాలి’’ అని భాగవత్‌ స్పష్టం చేసారు.
ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజమని, అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశమని స్పష్టం చేశారు.  కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని గుర్తు చేశారు. 

 మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ కార్య‌క్ర‌మ విశిష్ట‌త‌ను వివ‌రిస్తూ ఈ భూమండలమంతా ఒకప్పుడు భారత ధర్మమే విస్తరించి ఉండేదని చెప్పారు. అటువంటి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి భుజస్కందాలపైనా ఉందని తెలిపారు. మోహన్ భాగవత్ చేతుల మీదుగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్కృత విశ్వవిద్యాల‌యం మాజీ డీన్ రాణీ స‌దాశివ మూర్తి, ప‌ద్మ‌శ్రీ బిరుదాంకితులు ర‌మాకాంత్ శుక్లా విచ్చేశారు.