ఏపీలో మార్చ్ 10న  మున్సిపల్ ఎన్నికలు 

మున్సిపల్ ఎన్నికలకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎస్‌ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఈసీ ఆహ్వానం పంపింది. 1న ఉదయం 9:30కి ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరు రావాలని రాష్ట్ర ఎన్నికలు సంఘం పేర్కొంది.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కోడ్‌ను పాటించాలని.. రాజకీయ పక్షాలను ఎన్నికల కమిషన్‌ కోరనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వాయిదా పడిన మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరుగనున్నాయి.

రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 140 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రీ-నోటిఫికేషన్‌ జారీ చేశారు. వివిధ కారణాల వల్ల 4 నగరపాలక  సంస్థలు, 29 పురపాలక/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు.

గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చే నెల 2వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 3వ తేదీ సాయంత్రమే ప్రకటిస్తారు.

పోలింగ్‌ 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఎక్కడైనా రీ పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే 13వ తేదీన నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజున అంటే 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించి.. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ జారీతో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చే నెల 15 వరకు అమల్లో ఉంటుందని ఎస్‌ఈసీ వెల్లడించింది.