డిఎంకే ఇచ్చిన ‘టీవీ’ చూపితే రూ. లక్ష బహుమానం!

డిఎంకే ఇచ్చిన ‘టీవీ’ చూపితే రూ. లక్ష బహుమానం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతుండగా, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య వేడి రాజుకొంటున్నది. ప్రతిపక్ష డీఎంకేను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ఎటువంటి అవకాశాన్ని అన్నాడీఎంకే వదులుకోవడం లేదు. 
 
తాజాగా,   గతంలో  డీఎంకే ప్రభుత్వ హయాంలో అందజేసిన ‘టీవీ’ ప్రస్తుతం చక్కగా పనిచేస్తుంటే లక్ష రూపాయలను బహుమానంగా అంది స్తామని మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ ప్రకటించారు. తాళికి బంగారం పథకం కింద 2011 నుంచి రూ.6 వేల కోట్ల ను ఖర్చుచేశామని, ఈ పథకం ద్వారా 12 లక్షల కుటుం బాలు లబ్ధ్దిపొందాయని ఆయన పేర్కొన్నారు.
 
అన్నాడీఎంకే హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న డీఎంకే రాష్ట్ర అప్పులను రూ.1 లక్ష కోట్లు చేసి వెళ్లిందని, డీఎంకే అందజేసిన టీవీల కోసమే అప్పులు చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో విడతల వారీగా మధ్యనిషేధం అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు.
 
మరోవంక, మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అన్నాడీంకేలో చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి, ఇండియన్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు రాందాస్‌ అత్వాలే హితవు పలికారు. 
 
 రైతుల ఆదాయాన్ని పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను అమలుచేస్తోందని, రైతులు తమ ఆందోళనను విరమించుకుని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల్లో  డీఎంకే చిత్తుగా ఓడిపోతుందని, అన్నాడీఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.