బీజేపీలో చేరిన నటి పాయెల్‌ సర్కార్‌

బెంగాల్‌ నటి పాయెల్‌ సర్కార్‌ గురువారం బీజేపీలో చేరారు. కోల్‌కతాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బెంగాల్‌ యూనిట్‌ చీఫ్‌ దిలీఫ్‌ ఘోష్‌ సమక్షంలో కాషాయ పార్టీ తీర్థం స్వీకరించారు. 
 
పశ్చిమ బెంగాల్‌లో జరుగనున్న ఎన్నికలకు ముందు బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు మరో సినీ నటుడు యశ్‌దాస్‌ గుప్తా బుధవారం పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా సమక్షంలో పార్టీలో చేరారు. 

 బెంగాల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తోంది. ఒకపక్క జాతీయవాదాన్ని.. మరోపక్క స్థానిక సమస్యలను ఆసరా చేసుకొని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ఓ ప్లాన్ రూపొందించింది.

కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా… ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) నిర్మాణమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. పశ్చిమ్ బెంగాల్ చరిత్ర నిర్మాణంలో విశిష్ట వ్యక్తులుగా నిలిచిన స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తదితరుల స్ఫూర్తిని అందిపుచ్చుకుంటామని తెలిపారు. 

ఇదిలా ఉంటే, రెండు కోట్ల మంది నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని నడ్డా చెప్పారు. దీనికోసం బెంగాల్ వ్యాప్తంగా 30వేల సూచనల బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని, 294 నియోజకవర్గాల్లో సుమారు 100 బాక్సులు పెడుతున్నట్టు తెలిపారు. దీనిలో ఇంటింటికీ వెళ్లేవి 50 బాక్సులు ఉంటే, మరో 50 బాక్సులను కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పెడతామని తెలిపారు. 

ఈ క్యాంపెయిన్ వచ్చే నెల 3 నుంచి ప్రారంభమవుతుందని, 20వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మరోవైపు, మమతా సర్కార్‌పై నడ్డా ఫైర్ అయ్యారు. డెంగ్యూ ప్రమాదకర స్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రిపోర్టులు ఇవ్వకుండా డాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం బెంగాల్‌లో అధికారంలోకి వస్తే.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.