క్రిప్టో క‌రెన్సీ విలువ పెరిగిపోవ‌డంపై ఆర్బీఐ ఆందోళ‌న

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క్రిప్టో క‌రెన్సీ విలువ పెరిగిపోవ‌డంపై భార‌తీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌తదేశ ఆర్థిక స్థిర‌త్వాన్ని అవి ప్ర‌భావితం చేస్తాయ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ద్రుష్టికి తెచ్చామ‌ని ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌‌డించారు. 

దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అధికారికంగా డిజిటల్‌ కరెన్సీ తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

దేశంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీ లావాదేవీల‌పై పూర్తిగా నిషేధించి, సొంత డిజిటల్‌ కరెన్సీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని శక్తికాంత దాస్‌ మరోసారి స్పష్టంచేశారు. 

ఇప్పటికే చైనాలోని ఎలక్ట్రానిక్‌ యువాన్‌తోపాటు డిజిటల్‌ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్‌ చేరుతుందని శ‌క్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సంగ‌తిపై స్పష్టత ఇవ్వలేమన్నారు. సొంత డిజిల్ క‌రెన్సీ రూప‌క‌ల్ప‌న‌కు అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీ, ఇత‌ర విధాన‌ప‌ర‌మైన అంశాల‌పై ఆర్బీఐ పని చేస్తుంద‌ని పేర్కొన్నారు. 

ఇటీవల బిట్‌కాయిన్‌ విలువ ఎన్నడూ లేనంతగా పెరగడంతో క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరిగింది. నోట్ల రద్దు తర్వాత దేశీయంగానూ ఈ తరహా కరెన్సీ వినియోగం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని ఆర్బీఐ భావించింది. 

2018లో క్రిప్టో క‌రెన్సీల‌ను నిషేధించింది. అయితే, ఆర్బీఐ ఉత్తర్వులను సుప్రీంకోర్టు గ‌తేడాది కొట్టివేసింది. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశ‌గా బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది.