ఐఐటీ అంటే ఇన్స్‌టిట్యూట్స్‌ ఆఫ్ ఇండీజీన‌స్ టెక్నాల‌జీ

ఐఐటీ అంటే ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మాత్ర‌మే కాదు అని, అవి ఇన్స్‌టిట్యూట్స్‌ ఆఫ్ ఇండీజీన‌స్ టెక్నాల‌జీలుగా మారాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ 66వ స్నాత‌కోత్స‌వంలో ప్ర‌ధాని  వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విద్యార్థుల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ   21వ శ‌తాబ్ధంలో భార‌త్ ఆశ‌యాలు, అవ‌స‌రాలు మారిన‌ట్లు  వెల్ల‌డించారు.
 
 విద్యార్థుల్లో ఆత్మ‌విశ్వాసం, అవగాహ‌న‌, నిస్వార్థం ఉండాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై దృష్టి పెట్టి, భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన రీతిలో త‌యారుకావాలని పేర్కొ‌న్నారు.  ప‌దేళ్ల త‌ర్వాత అవ‌స‌రం వ‌చ్చే అంశాల‌ను ఆవిష్క‌రించాల‌ని చెప్పారు.  స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుంటే.. దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాలు దొరుకుతాయ‌ని ప్రధాని తెలిపారు.  అర్థం చేసుకునే త‌త్వం వ‌ల్లే.. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతాయ‌ని చెబుతూ వైఫ‌ల్యాలే శాస్త్ర‌వేత్త‌ల‌కు కొత్త దారులు క‌ల్పించాయ‌ని,  విజ‌యానికి అవే బాట‌లు వేశాయని గుర్తు చేశారు. 
కోట్లాది మంది ఆకాంక్షలకు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని,  ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని ప్రధాని  కోరారు. ‘‘130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు మీరు ప్రాతినిధ్యంవహించాలి. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి మీరంతా స్టార్టప్‌లుగా మారాలి’’ అని మోదీ చెప్పారు.

ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థను మోదీ కలలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 

సైన్స్, ఇన్నోవేషన్‌లో పెట్టుబడులతో, పరిశోధనలు చేసే ప్రతిభతో భారత దేశ భవిష్యత్తు రూపొందాలనే మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీ, హెల్త్‌కేర్ సమ్మేళనంతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దినట్లు తెలిపింది.