ఏబీవీపీ కార్యకర్తలపై కేరళ పోలీసుల లాఠీ ఛార్జ్

కేరళ పోలీసులు  ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలను చావబాదారు. కొట్టిన చోట కొట్టకుండా… తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సోమవారం నగరంలో చోటుచేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంక్ లిస్ట్‌ను కొనసాగించాలని కోరుతూ ఏబీవీపీ, బీజేవైఎం సంయుక్తంగా ఛలో సెక్రటేరియట్ నిర్వహించాయి. 
 
పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన పోలీసులు… కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. కిందపడినా కొడుతూనే ఉన్నారు.
 
 అయినా ‘జై జై భారత్ మాతా’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన కార్యకర్తలను సహచరులు ఆసుపత్రికి తరలించారు. పబ్లిక్ సర్వీస్ రాంక్ హోల్డర్లకు సంఘీభావంగా వారు  సచివాలయం ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు. 
 
పునరాయి విజయన్ ప్రభుత్వం దొడ్డిదోవలో తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి చూస్తున్నదని ప్రదర్శనకారులు మండిపడ్డారు. ప్రదర్శకులపై పోలీసులు వాటర్ క్యాన్ లను, బాష్పవాయువులను ప్రయోగించారు. 
 
నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు క్రూరంగా దాడి చేయడం పట్ల మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు కేజే అల్ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలు ఇస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతిభను పాతర వేస్తున్నదని దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన వారి పట్ల పక్షపాతం చూపుతున్నదని ఆరోపించారు. 
 
పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాంక్ లిస్ట్ ప్రకటించాలని కోరుతూ జనవరి 26 నుండి పలు యువజన సంఘాలు సచివాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు జరుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. యువకుల నిరసన పట్ల  స్పందించక పోవడం ప్రభుత్వం అహంకారానికి ప్రతీక అని బిజెపి విమర్శించింది.