కరోనా కాలంలో కలం యోధులు: పాత్రికేయ సమావేశంలో ప్రశంసలు

`కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమాల వివరాలను ప్రపంచానికి తెలియజెప్పి పాత్రికేయులు మరింతమందిలో స్ఫూర్తిని రగిలించారు. ఆ విధంగా సమాజకార్యంలో వారు కూడా ముందున్నారు’ అని స్ఫూర్తి పత్రిక సంపదకులు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణా ప్రాంత సహ కార్యవాహ డా. అన్నదానం సుబ్రమణ్యం అన్నారు. `కరోన కాలంలో కలం యోధులు’ అనే అంశంపై హైదరబాద్ కేశవ మెమోరియల్ లా కళాశాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరోనా కాలంలో వ్యక్తిగత శుభ్రత వంటి మంచి అలవాట్లు చేసుకోవడంతోపాటు ప్రజలు తమకు తోచిన విధంగా ఇతరులను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చారని ఆయన అన్నారు. వీరితోపాటు వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది చేసిన అపూర్వమైన కరోన పోరాటాన్ని కూడా పాత్రికేయులే ప్రపంచానికి తెలియజెప్పారని ఆయన ప్రశంసించారు. సమాజానికి కళ్ళు, చెవులు, చేతులుగా వ్యవహరించే పత్రికలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు పెడ ధోరణులను అరికట్టడంలో కూడా ప్రముఖ పాత్ర వహించాలని కోరారు. `కత్తికంటే కలం గొప్పది’ అనే నానుడి ఉన్నప్పటికీ స్వాతంత్ర్యానికి ముందు పత్రికల్లో కనిపించిన జాతీయభావం ఇప్పుడు కొంత తగ్గినట్లు కనిపిస్తోందని డా. సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. దేశానికి ఎంతో మేలు చేసే రైతులు, కార్మికులు మొదలైనవారి గురించి పత్రికలు వ్రాయాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ కరోనా కాలం కష్టాలు తెచ్చినా కొంత మేలు కూడా చేసిందన్నారు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికి పరిమితం కావడంతో కుటుంబసభ్యుల మధ్య బంధం మరింత దృఢపడిందని, ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలను తెలుసుకునే అవకాశం లభించిందని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఇంటినుండే వార్తలను వినిమయం చేయడం నేర్చుకున్నామని ఆయన అన్నారు. అలాగే సంఘ పరివార్ నిర్వహించిన సేవాకార్యక్రమాల గురించి ప్రపంచానికి తెలియజేసిన పాత్రికేయులు స్వయంగా అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారని వల్లీశ్వర్ అన్నారు. అయితే ఈ కష్టకాలంలో ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అనేక పత్రిక, మీడియా యాజమాన్యాలు ఆర్ధిక భారం తగ్గించుకోవడం అనే నెపంతో వారిని తొలగించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

అంతకుముందు సీనియర్ పాత్రికేయులు శ్రీ విద్యారణ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత పాత్రికేయులు నర్సింగ రావు, మల్లేశం, వీరప్ప, దేవిక, సిద్దులు కరోన కాలంలో తమ అనుభవాలను వివరించారు. శ్రీనాధ్ వందన సమర్పణ, శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

Source: VSK Telangana