దేశంలో కరోనా కట్టడి అవుతున్నట్లు ఒక వంక ఊపిరి పీల్చుకొంటుండగా, అలసత్వం కారణంగా మరోవంక పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే అత్యధికం.
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో దాదాపు సగం (6,112) కేసులు మహారాష్ట్రకు చెందినవే. కేరళలో రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆరు రాష్ట్రాల నుంచే రోజూ 87% కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్యపరంగా కూడా మహారాష్ట్ర అధ్వాన్న స్థితిలో ఉన్నది.
శుక్రవారం 101 మరణాలు నమోదు కాగా.. మహారాష్ట్రలో 44 మంది చనిపోయారు. దీంతో వైరస్ కట్టడి కోసం ఈ ఆరు రాష్ర్టాల ప్రభుత్వాలు తిరిగి కఠిన చర్యలు చేపడుతున్నాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ప్రాంతాలను గుర్తించి కట్టడి చర్యలు ప్రారంభించారు. ముంబైలో 1,305 నివాసాలను క్వారంటైన్ ఇండ్లుగా ప్రకటించారు.
బ్రిటన్ నుంచి బెంగళూరుకు వచ్చిన వారిలో బ్రిటన్ స్ట్రెయిన్ గుర్తించినట్లు ప్రకటించిన కర్ణాటక, యూకే నుంచి వచ్చే వారిపై నిషేధం విధించింది. మహారాష్ట్ర, కేరళల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపెట్టాలని స్పష్టంచేసింది.
కాగా, దేశంలో కోటీ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 1.86 లక్షల జైబ్స్ ఇచ్చామని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు 1,08,38,323 మంది వ్యాక్సిన్ వేసుకున్నారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ మన్‌దీప్ భండారి తెల్లడించారు.
More Stories
ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలి
ఛత్తీస్గఢ్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
వరకట్న వేధింపుల కేసుల్లో చట్ట దుర్వినియోగంపై సుప్రీం సీరియస్