భారత్ మీడియాపై చైనా ప్రభుత్వం అక్కసు 

సరిహద్దుల్లో గాల్వాన్ లోయ వద్ద తమ సేనల దుశ్చర్యలు ప్రపంచం దృష్టికి వస్తూ ఉండడంతో ఆత్మరక్షణలో పడిన చైనా తాజాగా రెండు వీడియోలు విడుదల చేసి మరింతగా నవ్వులపాలు కావడంతో ఇప్పుడు దీనికంతకు కారణం మీరే అంటూ భారత్ మీడియాపై అక్కసు ప్రదర్శిస్తున్నది.

చైనాకు కలిగిన నష్టాన్ని ఎక్కువ చేసి చూపేందుకు భారత్ మీడియా ప్రయత్నించిందంటూ చైనా మండిపడింది. ఈ మేరకు అధికారిక మీడియా ద్వారా తన ఆవేశం వెళ్లగక్కింది. చైనా ప్రదర్శించిన నిజాయితీని, దయాగుణాన్ని భారత్ మీడియా అర్థం చేసుకోలేక పోయిందని ఆరోపిస్తూ చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

‘విధి నిర్వహణలో నేలకొరిగిన సైనికులకు నివాళులర్పిస్తూ చైనా విచారంలో మునిగిపోయిన సందర్భంలోనూ.. భారత్ మీడియా, కొందరు నెటిజన్లు చైనాకు జరిగిన నష్టాన్ని ఎక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ వైఖరితో వారు తమను తామే మోసగించుకుంటున్నారని చైనా భద్రతా నిపుణులు చెబుతున్నారు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కింది.

బలాల ఉపసంహరణ ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు చైనా చూపుతున్న నిజయాయితీ, దయాగుణాన్ని భారత మీడియా అర్థం చేసుకోలేకపోతోందని అంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.  కాగా.. గతేడాది చైనా ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులను కోల్పోయి ఉండొచ్చంటూ భారత్‌తో పాటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అమెరికా నిఘా సంస్థల అంచనా కూడా ఇదేన్ననది ఈ వార్తల సారాంశం. ఇక రష్యా మీడియా కూడా కనీసం 40 మంది చైనా సైనికులు భారత దళాల దాడిలో మృతి చెంది ఉంటారని పేర్కొంది. అయితే..ఈ విషయమై ఇంతకాలం మౌనం వహించిన చైనా..దళాల ఉపసంహరణ సంద్భంగా ఈ అంశాన్ని లేవనెత్తింది.

కేవలం నలుగురు మాత్రమే మరణించారంటూ శుక్రవారం నాడుప్రకటించింది. ఈ ప్రకటనపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ మీడియాపై చైనా తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.