పేప‌ర్‌లెస్ విధానం ద్వారా పాస్‌పోర్ట్  

ఇక‌పై పాస్‌పోర్టు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ ఒర్జిన‌ల్ డాక్యుమెంట్ల‌ను పాస్‌పోర్ట్ కార్యాల‌యానికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. స‌ద‌రు వ్య‌క్తి త‌న డిజిలాక‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచిన ప‌త్రాల ప్ర‌తుల‌ను పేప‌ర్‌లెస్ విధానం ద్వారా పాస్‌పోర్ట్ కోసం స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ఈ పధకాన్ని కేంద్ర విదేశాంగ స‌హాయ మంత్రి వీ మురళీధరన్ ప్రారంభించారు. ఈ పధకం సాయంతో ప్ర‌జ‌లు ఎక్క‌డ నుంచైనా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాలను భ‌ద్ర‌ప‌రిచేందుకు కేంద్రం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించింది. ఈ డిజిలాక‌ర్‌లో ఉన్న డాక్యుమెంట్ల‌ను దృవీక‌ర‌ణ కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఈ కొత్త సదుపాయంతో, పాస్‌పోర్ట్  దరఖాస్తుదారులు డిజిలాకర్ ద్వారా అవసరమైన వివిధ పత్రాలను పేప‌ర్‌లెస్‌ విధానంలో సమర్పించడానికి వీలు చిక్కుతుంది. ఈ డిజిలాక‌ర్ ఎక్క‌డైనా అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను డిజిట‌ల్ రూపంలో అందించి మీ వివ‌రాల‌ను దృవీక‌రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

డిజిట‌ల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేది డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లు / ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి, ధృవీకరించడానికి స‌రైన వేదిక కానుంది‌. ఈ విధానం భౌతికంగా పత్రాల వాడకాన్ని తొలగిస్తుంది.

అంతేకాకుండా, పాస్‌పోర్ట్‌లు కూడా డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేస్తే, వినియోగదారులకు అధికారికంగా అవ‌స‌ర‌మైన వివ‌రాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఒక‌వేళ ఎవ‌రైనా పాస్‌పోర్టును పోగొట్టుకున్నా డిజిలాక‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచిన డిజిట‌ల్ పాస్‌పోర్ట్ చాలా ఉప‌క‌రిస్తుంది.

గత 6 సంవత్సరాల్లో పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్లో చాలా మెరుగుదల ఉందని విదేశాంగ‌శాఖ వెల్ల‌డించింది.  ఇదిలా ఉంటే, పౌరుల కోసం త్వ‌ర‌లో ఈ -పాస్‌పోర్ట్ విధానాన్ని రూపొందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ యోచిస్తున్న‌ది. ఇది భద్రతను పెంచ‌డంతోపాటు విదేశీ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో పౌరుల‌కు సౌకర్యవంతంగా ఉంటుంది.