బెంగాల్ నేతలకు కేంద్రం భద్రత!

బెంగాల్ నేతలకు కేంద్రం భద్రత!

అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌లో డజన్‌కు పైగా ఎమ్మెల్యేలు, ఎంపిలను విఐపి భద్రతా ఏర్పాట్ల వలయంలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. 

అధికార టిఎంసి నుంచి ఇటీవలి కాలంలో బిజెపిలోకి చేరిన పలువురు కూడా ఈ సెక్యూరిటీ కవర్‌లోకి వచ్చారు. వీరికి ముప్పు పొంచి ఉందనే విశ్లేషణలు, కేంద్రీయ భద్రతా సంస్థల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖ భద్రతా ఏర్పాట్ల నిర్ణయం తీసుకుంది.

 పశ్చిమ బెంగాల్‌లో సంచరించేటప్పుడు ఈ నేతలకు తక్కువ స్థాయి సెంట్రల్ విఐపి సెక్యూరిటీ ఏర్పాట్లు అయిన ఎక్స్, వై కేటగిరిలను కల్పిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భద్రతా బలగాల పరిధిలోనే ఈ సెక్యూరిటీ వలయం ఉంటుంది.

ఇలా ఉండగా, పోలింగ్ విధుల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించకుండా బెంగాల్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. వీరు రెగ్యులర్ ఉద్యోగులు కానందున..పోలింగ్ అవకతవకలకు వీరిని బాధ్యులను చేయలేమని ఈసీకి ఓ లేఖ రాసింది. 

కేంద్ర బలగాల దుర్వినియోగాన్ని కూడా అడ్డుకోవాలని బీజేపీ కోరింది. వారు కేవలం నగరాలు, ప్రధాన రహదారులకు మాత్రమే పరిమితం కాకుండా.. సున్నిత  ప్రాంతాల్లోనూ మోహరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

 సిబ్బంది కొరత ఉన్నట్టైతే పొరుగు రాష్ట్రాల నుంచి సిబ్బందిని తెప్పించుకోవచ్చని కూడా ఈ సందర్భంగా బీజేపీ సూచించింది. బెంగాల్ ప్రభుత్వం ఎన్నికల బాధ్యతలను కాంట్రాక్ట్ సిబ్బందికి అప్పగించేందుకు యోచిస్తున్నట్టు తమకు సమాచారం అందినట్టు కూడా బీజేపీ తన లేఖలో పేర్కొంది.