మమత మేనల్లుడి భార్యకు సీబీఐ సమన్లు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ నివాసానికి సీబీఐ టీమ్ ఆదివారంనాడు వెళ్లింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీ భార్య  నరులా  రుజోరా బెనర్జీకు నోటీసులు అందజేసేందుకు సీబీఐ బృందం వెళ్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

బొగ్గు స్మగ్లింగ్ కేసులో సీబీఐ ఇటీవల 13 ప్రాంతాల్లో దాడులు జరిపింది.  ఈ కేసుపై సీబీఐ గత ఏడాది సెప్టెంబర్ లో దర్యాప్తు ప్రారంభించింది. బొగ్గు స్మగ్లింగ్ జరిగినట్టు అనుమానిస్తున్న సుమారు 40 ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరిపింది. రుజోరా బ్యాంకు ఖాతాలలో పలు అనుమానాస్పద లావాదేవీలను సిబిఐ కనుగొన్నదని, బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించిన నిధులు కొన్ని ఆమె ఖాతాలకు చేరి ఉండవచ్చని భావిస్తున్నదని తెలుస్తున్నది. 

గతంలో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మార్చ్, 2019లో ఆమె రాష్ట్ర పోలీసుల సహాయంతో కస్టమ్ అధికారుల తనిఖీ లేకుండా కొలకత్తా విమానాశ్రయం నుండి వెలుపలకు వచ్చారనే ఆరోపణలు చెలరేగాయి. ఆమె అక్రమంగా బంగారం తీసుకు వస్తున్నట్లు కస్టమ్ అధికారులు అనుమానించారు. 

ఆ తర్వాత ఆమె కొలకత్తా హైకోర్టు కు వెళ్లి అనుకూలంగా తీర్పు పొందారు. ఆమె రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అంటూ అదే నెలలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆమెకు నోటీసు జారీ చేసినా, ఈ విషయమై ఆ తర్వాత మరేమి జరగలేదు.  

 బొగ్గు అక్రమపై సిబిఐ దర్యాప్తు జరిపినప్పటి నుండి నకిలీ కంపెనీల ద్వారా బొగ్గు అమ్మకాలలో డబ్బును స్వాహా చేశారని, అధికార పక్షానికి నిధులు సమకూర్చడంకోసం ఉపయోగించు కున్నారని, ఈ లావాదేవీలలో ప్రధాన లబ్ధిదారుడు అభిషేక్ బెనర్జీ అని బిజెపి ఆరోపిస్తూ వస్తున్నది. 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రధానంగా అభిషేక్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నది. మమతా ప్రభుత్వంలో అధికారం అంతా మేనల్లుడిదే అని అంటి `అత్తా-మేనల్లుడు’ రాజ్యం నడుస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్నది. 

కాగా, పరువునష్టం కేసులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను వ్యక్తిగతంగా కానీ, లాయరు ద్వారా కానీ ఈనెల 22న హాజరు కావాలంటూ బెంగాల్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సమన్లు చేసిన మరుసటి రోజే ఈ  సీబీఐ ఈ దాడులు చోటుచేసుకున్నాయి.  అమిత్‌షాపై అభిషేక్ బెనర్జీ ఈ పరువునష్టం కేసు వేశారు.