అమరావతి భూములను తాకట్టు పెట్టనున్న జగన్ ప్రభుత్వం 

గత రెండేళ్లుగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే పనులను ఎక్కడికక్కడ నిలిపివేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వంక శాసన రాజధానిని విశాఖపట్నంకు తరలించే ప్రయత్నం కొనసాగిస్తూ, మరోవంక ఇక్కడ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. 
 
అయితే అందుకు అవసరమైన ఆర్దిక వనరులను మాత్రము రైతులు రాజధాని కోసం ఉచితంగా ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి సమీకరించే ప్రయత్నం చేస్తున్నది. దీనికోసం దీనికోసం ఇప్పటికే బ్యాంకుల కన్సార్టియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఎంఆర్‌డిఎ) సంప్రదించినట్లు తెలిసింది.
తాకట్టు కోసం ఎకరం భూమి విలువ రూ.2.50 కోట్లుగా నిర్థారించారు. అయితే కరకట్ట విస్తరణ, జాతీయ రహదారి నిర్మాణం అనంతరం కొంత ధర పెరుగుతుందని, అవసరమయితే అప్పుడు మరోసారి భూముల ధరలను సవరించొచ్చనే భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ అధ్యక్షతన నియమించిన కమిటీ కూడా వీటికి సంబంధించిన అంశాలపైనా సమీక్ష నిర్వహించింది. 
 
దీనిలో పేదల కోసం కట్టిన ఇళ్లను రాజధాని పరిధిలో పేదలకు ఇవ్వాలా, లేక ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వాలా అనే అంశంతోపాటు నిధుల సమీకరణకు అవసరమైతే వాటిని కూడా బ్యాంకుల కన్సార్టియంలో తాకట్టు పెట్టే అంశాన్ని పరిశీలించారు. 
 
రాజధానిలో లేఅవుట్ల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కోసం సుమారు రూ.14 వేల కోట్లు అవసరం అవుతాయని ఎఎంఆర్‌డిఏ అంచనా వేసింది. భూముల తాకట్టుకు సంబంధించి ఇప్పటికే యూనియన్‌ బ్యాంకు కన్సార్టియంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.  ప్రస్తుతం రోడ్లు, కనెక్టివిటీకి కొంత సొంత నిధులు వెచ్చించి భూమి విలువ పెరిగిన తరువాత వాటిని ఆర్థికవనరుగా వినియోగించుకునే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. 
 
కాగా, అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెంచాలనే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుండి ఉన్న కరకట్టను నాలుగులైన్లుగా మార్చనున్నారు. దీంతోపాటు గతంలో మంజూరైన అనంతపురం జాతీయ రహదారిని అమరావతి వరకూ విస్తరించాలనే ప్రతిపాదనా వచ్చినట్లు తెలిసింది. దీనిద్వారా అక్కడ భూముల విలువ పెరుగుతుందని అంచనా వేశారు.