అంతర్వేదిలో రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు.  నూతన రథం వద్ద  ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.

శుక్రవారం ఉదయం అమరావతి నుండి నేరుగా అంతర్వేదికి చేరుకున్న సీఎం జగన్.. శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకొని,  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి అంతర్వేది ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు మాసాల్లోనే కొత్త రథాన్ని తయారు చేయించింది. ఏడు అంతస్థులతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో రూ.1.10 కోట్లతో ఈ రథాన్ని నిర్మించారు. 

రధంను దగ్ధం చేసి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చలేకపోయింది. మరోవైపు ఈనెల 28 వరకు స్వామి కళ్యాణోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే రథాన్ని ఈరోజు స్వామి కళ్యాణోత్సవంలో మొదటి రోజున ఏపీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు.