స్టీల్‌ప్లాంట్‌ పై కేంద్రం విధాన నిర్ణయం తీసుకోలేదు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేట్ పరం చేసే విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోలేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.  విపక్షాలు రాష్ట్ర ప్రజలను ఈ విషయమై  మభ్యపెడుతున్నాయని తప్పుబట్టారు.
 
కియా వస్తే క్రెడిట్‌ మాదే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌ చెప్పుకున్నారని గుర్తు చేస్తూ ప్రైవేట్‌ సంస్థలు వస్తే రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుందనడం సరికాదని జీవీఎల్ విమర్శించారు. స్థానికుల మనోభావాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 
అంతిమ నిర్ణయం జరగాలంటే ఇంకా పెద్ద ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. భూతద్దంలో చూపిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు పాకులాడుతున్నాయని ఆరోపించారు.
 
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా ప్రస్తావన తీయలేదని ఎంపీ జీవీఎల్ గుర్తు చేశారు. కేవలం ప్రజలను మభ్య పెట్టాలను చూస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధానిగా గతంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం పరిస్థితుల ప్రభావమని చెప్పారు. ఏపీకి కేంద్రం అదనంగా నిధులు ఇస్తోందని తెలిపారు.
 
వైసీపీ అరాచకాలను కేంద్రం దృష్టికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. ఏపీలో మతమార్పిడిలు విచ్చలవిడిగా పెరిగాయని, మతమార్పిడిల కారణంగా దళితులు రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దళితులకే రిజర్వేషన్లు లభించాలని ఆకాంక్షించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు త్వరలో ఫిర్యాదు చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. రామతీర్థం ఘటనలో దోషులను ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదని ధ్వజమెత్తారు.