ఏఐఏడీఎంకే నాయకత్వంకోసం కోర్టుకెక్కిన శశికళ 

రూ 66 కోట్ల అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లపాటు జైలు శిక్షను పూర్తి చేసుకొని గత వారం చెన్నైకి తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ  ఏఐఏడీఎంకే పార్టీ నాయకత్వంపై కన్ను వేశారు. నాలుగైదు రోజులు మౌనంగా ఉన్న ఆమె ఆ పార్టీ అత్యున్నత పదవిని తిరిగి తనకు ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. 

ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌న్నీరుసెల్వంల‌కు వ్య‌తిరేకంగా ఆమె కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కొన్ని రోజుల్లోనే త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామం ఆస‌క్తి రేపుతోంది. 

జయలలిత మృతి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కైవసం చేసుకున్న శశికళను 2017లోనే పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వంల ప్రోద్బలంతో పార్టీ తీర్మానం చేసింది. 

ఇప్పుడు ఆ తీర్మానాన్ని సవాల్ చేస్తూ శ‌శిక‌ళ అప్పుడే కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు మ‌రోసారి త‌న‌కు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం ఇప్పించ‌డంతోపాటు పిటిష‌న్‌ను వెంట‌నే వినాల‌ని కోర్టును అభ్య‌ర్థించింది. ఈ కేసును మార్చి 15న కోర్టు విచారించ‌నుంది. ఎన్నికల సమయంలో తనతో రాజీ వచ్చేటట్లు పార్టీ నాయకత్వంపై వత్తిడి తీసుకు రావడం కోసమే ఆమె ఈ ఎత్తుగడ వేసిన్నట్లు కనిపిస్తున్నది.