రోహింగ్యాలకు పాస్‌‌పోర్ట్‌లు ఇవ్వడం దేశద్రోహమే 

రోహింగ్యాలకు పాస్‌‌పోర్ట్‌‌లు ఇవ్వడం సిగ్గుచేటని బిజెపి  ఎంపీ డి అర్వింద్ మండిపడ్డారు. నిజామాబాదు  జిల్లాలో దొంగ పాస్‌‌పోర్టుల వ్యవహారం హిందువులను కలవరపెడుతోందని ఆయన పేర్కొన్నారు. రోహింగ్యాల పాస్‌‌పోర్టుల వ్యవహారంలో సీపీపోలీస్ కమీషనర్ కార్తికేయ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హిందువులను ఇబ్బంది పెట్టడానికి సీపీ కార్తికేయ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని.. ఆయన సూచనల మేరకే హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ టీఆర్ఎస్-ఎంఐఎం ఏజెంట్ అని, ఆయన ప్రోద్భలంతోనే రోహింగ్యాలకు దొంగ పాస్‌‌పోర్టులు ఇచ్చారని ధ్వజమెత్తారు. 

రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం.. రోహింగ్యాలకు దొంగ పాస్‌‌పోర్టులు మాత్రం ఇస్తోంది. ఈ ప్రభుత్వం ఎంఐఎంకు అమ్ముడుపోయిందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జారీ అయిన ఆధార్ కార్డులపై విచారణ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ను డిమాండ్ చేశారు.

రోహింగ్యాలకు పాస్‌‌పోర్టులు ఇవ్వడం దేశ ద్రోహం అని అరవింద్ మండిపడ్డారు.  కేసీఆర్ కుటుంబం హిందువులను అణగదొక్కుతోందని పేర్కొంటూ కేసీఆర్ రాజకీయ జీవితాన్ని, టీఆర్ఎస్‌‌ను బొంద పెట్టేవరకు బీజేపీ నిద్రపోదని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ తీరుపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.

అడ్వకేట్ వామన్ రావ్ దంపతులను నడిరోడ్డుపై నరికినా  కేసీఆర్ ప్రభుత్వం స్పందించడం లేదని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు వామన్ రావ్‌‌ను హత్య చేశారని ఆరోపియన్చారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొంటూ  అడ్వకేట్ దంపతుల హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.