ఎఫ్‌ఎటిఎఫ్ జాబితాలో జూన్ వరకు పాక్

ఉగ్రవాద సంస్థలకు నిధుల సాయం, మనీలాండరింగ్ తదితర అనైతిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఏర్పడిన ఆర్థిక కార్యాచరణ టాస్క్‌ఫోర్స్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఎటిఎఫ్) పర్యవేక్షణ జాబితా (గ్రే లిస్ట్ ) నుంచి జూన్ వరకు పాకిస్థాన్ నిష్క్రమించే అవకాశం కనిపించడం లేదు. 

ఎఫ్‌ఎటిఎఫ్ ప్లీనరీ, వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈ నెల 21 నుంచి 26 వరకు పారిస్‌లో జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన సభ్య దేశాల మద్దతును పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. గ్రేలిస్ట్‌లో పాకిస్థాన్ స్థాయిపై ఆ సమావేశాల్లో నిర్ణయిస్తారు. 

2018 జూన్‌లో ఎఫ్‌ఎటిఎఫ్ గ్రేలిస్ట్‌లో పాకిస్థాన్‌ను చేర్చారు. అమలు చేయాల్సిన చర్యలకు సంబంధించి 27 కార్యాచరణ అంశాలను సూచిస్తూ కొంత గడువు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో వర్చువల్ ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ ఎంతవరకు తాము సూచించిన అంశాలను అమలు చేసిందో సమీక్షించారు.

మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం కల్పించడం, తదితర కీలకమైన ఆరు అంశాలను అమలు చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ లపై చర్య తీసుకోలేక పోయిందని వివరించారు. 

పాక్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషి వచ్చే ఎఫ్‌ఎటిఎఫ్ సమావేశంలో తాము గ్రేలిస్ట్ నుంచి బయటపడగలమన్న ఆశాభావంతో ఉన్నప్పటికీ జూన్ వరకు పాక్ ఆ గ్రేలిస్టు లోనే కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఆ సమావేశాలకు ముందుగా క్షేత్రస్థాయి సందర్శన జరిగేలా సభ్యదేశాల మద్దతును తనకు అనుకూలంగా కూడగట్టడానికి పాక్ ప్రయత్నిస్తోంది. దానికి ఎఫ్‌ఎటిఎఫ్ అంగీకరిస్తే క్షేత్రస్థాయి పరిశీలనతో పాక్ గ్రేలిస్టు నుంచి జూన్ నాటికి బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.