మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాకు అమెరికా హెచ్చరిక 

మానవ హక్కుల ఉల్లంఘనకు చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. మానవ హక్కుల ఉల్లంఘనపై చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి తమ వైఖరి వారికి తెలియజేశామని, ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు బైడెన్ వెల్లడించాయిరు.

‘ఐక్యరాజ్యసమితితోపాటు చైనా విధానాన్ని ప్రభావితం చేసే ఇతర ఏజెన్సీల ద్వారా మానవ హక్కులకు అనుకూలంగా స్వరం పెంచే మా పాత్రను నిర్వహిస్తాం’ అని జిన్‌పింగ్‌కు చెప్పానని స్పష్టం చేశారు. ప్రపంచ ఉపాధ్యాయుడిగా మారేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని పేర్కొంటూ అలా కావాలంటే వారు ఇతర దేశాల నమ్మకాన్ని పొందాల్సి ఉంటుందని తెలిపారు. 

మానవ హక్కులకు విరుద్ధమైన కార్యకలాపాలలో చైనా పాల్గొన్నంత కాలం వారు ప్రపంచ ఉపాధ్యాయుడిగా మారలేరని స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్లు జూలై చివరి నాటికి సాధారణ ప్రజలకు విస్తృతంగా లభిస్తాయని జో బైడెన్‌ చెప్పారు. తదుపరి క్రిస్మస్ నాటికి దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రాగలవని నమ్ముతున్నట్లు తెలిపారు. 

జూలై చివరికల్లా కరోనా వ్యాక్సిన్ 600 మిలియన్లకు పైగా అందుబాటులోకి వస్తుందని, ప్రతి అమెరికన్‌కు టీకాలు వేయడానికి ఇది సరిపోతుందని భరోసా వ్యక్తం చేశారు.