బీజేపీలో చేరిన బెంగాలీ నటుడు యశ్ దాస్‌గుప్తా  

బెంగాలీ నటుడు యశ్ దాస్‌గుప్తా బుధవారం కోల్‌కతాలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాస్‌గుప్తా బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు ఎప్పుడో వెలువడ్డాయి.

బీజేపీ నాయకులు కైలాష్ విజయవర్గియా, ముకుల్ రాయ్ సమక్షంలో హీరో దాస్‌గుప్తా బీజేపీ కండువా కప్పుకున్నారు. విజయవర్గియా దాస్‌గుప్తాకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి అభినందించారు. హీరో యశ్‌ దాస్‌గుప్తాతో పాటు అశోక్ భద్ర, మల్లికా బండియోపాధ్యాయ, పాపియా అధికారి, సౌమిలి ఘోష్ బిస్వాస్, ట్రామిలా భట్టాచార్య తదితరులు కూడా పార్టీలో చేరారు.

వన్, మోన్ జానే నా, టోటల్ దాదాగిరి, ఫిడా వంటి చిత్రాలలో యశ్‌ దాస్‌గుప్తా నటించారు. దేశ శ్రేయస్సు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని యశ్‌ దాస్‌గుప్తా బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న బీజేపీయే పశ్చిమ బెంగాల్‌లో సరైన పార్టీ అని నమ్మి చేరినట్లు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముందు ఈ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక్కడ ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది.

పశ్చిమ బెంగాల్‌లో అసలే కనిపించని స్థాయి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమైన రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించింది. ఆ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 18 స్థానాలను దక్కించుకున్నది.

కాగా,  వచ్చే ఎన్నికల్లో తృణమూల్ చేస్తోన్న అవినీతి, హింస లాంటి మోడల్ పనిచేయవని తృణమూల్ మాజీ నేత దినేశ్ త్రివేదీ స్పష్టం చేశారు. ‘‘అవినీతి, హింస అన్న రెండు మోడళ్లను టీఎంసీ మోస్తోంది. అవి ఇంకెంతో కాలం పనిచేయవు. అంధకారం నుంచి రాష్ట్రం బయటికి వస్తుంది.’’ అని త్రివేదీ పేర్కొన్నారు. 

బెంగాల్‌లో నిజమైన మార్పును తీసుకురావడానికి నూతన చట్టాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ‘‘అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల గురించి బెంగాల్‌ గడ్డపై మాట్లాడతారు. కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం. తృణమూల్ అనుసరిస్తున్న హింస, అవినీతి మోడల్ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేవు. ఈ రెండు రాష్ట్రాన్ని చీకట్లోకి తీసుకెళ్లాయి.’’ అని దినేశ్ త్రివేదీ మండిపడ్డారు.