అయోధ్యకు వెండి ఇటుక‌లు పంప‌కండి

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుకలు ఎవరూ పంపవద్దని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. భక్తులు బహూకరించిన వెండి ఇటుకలను భద్రపరచడానికి బ్యాంకు లాకర్లలో స్థలం లేదని, అందుకే ఎవరూ వెండి ఇటుకలను సమర్పించవద్దని కోరింది. ఇప్పటి వరకు 400 కిలోగ్రాముల వెండి ఇటుకలను భక్తులు సమర్పించారని ట్రస్ట్ పేర్కొంది.
 
 ‘‘రామ మందిర నిర్మాణానికి దేశంలో అనేక మంది భక్తులు వెండి ఇటుకలను బహూకరిస్తున్నారు. మరికొన్ని కూడా వస్తున్నాయి. అయితే వాటిని ఎలా భద్రపరచాలన్న విషయంలో ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి ఎవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దు. బ్యాంక్ లాకర్లన్నీ నిండిపోయాయి.’’ అని ట్రస్ట్ ప్రకటించింది.
 
 అయితే భక్తుల మనోభావాలను తాము అత్యంత శ్రద్ధతో అర్థం చేసుకుంటామని, అయినా సరే… భక్తులెవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దని కోరింది. ఒక‌వేళ ఆల‌యం కోసం ఇంకా వెండి అవ‌స‌ర‌మైత అప్పుడు మ‌ళ్లీ అడుగుతామ‌ని చెప్పారు. 
మ‌రోవైపు మందిర నిర్మాణానికి న‌గ‌దు రూపంలో కూడా భారీగా విరాళాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఇది రూ.1600 కోట్ల‌కు చేరిన‌ట్లు ట్ర‌స్ట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ విరాళాల సేక‌రణ కోసం ట్ర‌స్ట్ ఇప్ప‌టికే ఎన్నో గ్రూపుల‌ను ఏర్పాటు చేసింది. చెక్కుల రూపంలో లేదంటే ట్ర‌స్ట్ బ్యాంక్‌కు బ‌దిలీ చేయ‌డం ద్వారా విరాళాలు ఇవ్వాల‌ని ట్ర‌స్ట్ కోరుతోంది.
మొత్తంగా దేశ‌వ్యాప్తంగా ల‌క్షా 50 వేల గ్రూపులు ఈ విరాళాల సేక‌ర‌ణ‌లో పాలుపంచుకుంటున్న‌ట్లు ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ తెలిపారు. 39 నెల‌ల్లో మొత్తం మందిర నిర్మాణం పూర్త‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు.