బాంబు పేలుడులో తాలిబాన్‌ చీఫ్‌ మృతి!

తాలిబాన్‌ చీఫ్‌ హైబాతుల్లా అఖుండ్‌జాడా ఒక బాంబు పేలుడులో మరణించినట్లు తెలుస్తున్నది. కొన్ని నెలల కిందట బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలోని ఒక సురక్షితమైన ఇంట్లో జరిగిన పేలుడులో హైబాతుల్లాతోపాటు తాలిబాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ముల్లా మాటియుల్లా, గ్రూప్ ఫైనాన్స్ హెడ్ హఫీజ్ అబ్దుల్ మజీద్‌ మరణించినట్లు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హాష్-ఇ-సుబ్ వార్తాపత్రిక పేర్కొంది.

గత ఏడాది ఏప్రిల్‌లో మజీద్‌కు చెందిన ఇంట్లో జరిగిన ఈ పేలుడులో హైబాతుల్లా, ముల్లా వెంటనే చనిపోగా తీవ్రంగా గాయపడిన మజీద్‌ పాకిస్థాన్‌ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల అనంతరం మరణించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా, ఆదివారం వెలువడిన ఈ వార్తను తాలిబాన్‌ ఖండించింది. ఇది తప్పుడు వార్త, నిరాధారమైన పుకారు అని తాలిబాన్ సీనియర్‌ నాయకుడు అహ్మదుల్లా వాసిక్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

శత్రువులు, వారి నిఘా వర్గాలు తమ పరాజయాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. కాగా, హైబాతుల్లా మరణం వార్త నిజమైతే ముల్లా ఒమర్, ముల్లా అక్తర్ మన్సోర్ తర్వాత పాకిస్థాన్‌లో చనిపోయిన మూడవ తాలిబాన్ చీఫ్ ఆయనే అవుతాడు.

2013లో ముల్లా ఒమర్‌ చనిపోగా రెండేండ్ల వరకు తాలిబాన్‌ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఆఫ్ఘనిస్థాన్‌ నిఘా సంస్థ దీనిని బహిర్గతం చేయడంతో 2015 జూలైలో ముల్లా ఒమర్‌ మరణాన్ని తాలిబాన్‌ నిర్థారించింది. అలాగే తర్వాత చీఫ్‌ ముల్లా అక్తర్ మన్సోర్ 2016 మేలో బలూచిస్థాన్‌లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో మరణించాడు.

ఈ విషయాన్ని కూడా కొంత కాలం దాచిన తాలిబాన్‌ అనంతరం హైబాతుల్లాను చీఫ్‌గా ప్రకటించింది. అయితే ఆయన కూడా గత ఏడాది బాంబు పేలుడులో చనిపోయినట్లు తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌ వార్తాపత్రిక పేర్కొంది.