సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్‌

ప్రముఖ గుట్కా కింగ్, వ్యాపారవేత్త, సినీ నటుడు సచిన్ జోషీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో సచిన్‌జోషిని ఈడీ ముంబై విమానాశ్రమంలో అదుపులోకి తీసుకుంది. సచిన్‌‌ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. 

ఆయనపై హైదారా‌బాద్‌లోని బ‌హ‌దూర్పురా పోలీస్ స్టేష‌న్‌లో ఐపీసీ సెక్ష‌న్ 336, 273 కింద కేసులు గతంలో నమోదయ్యాయి. అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్‌ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి సచిన్‌ జోషి విదేశాల్లో ఉన్నారు.  దీంతో ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌ నుంచి ముంబైకి రాగానే ఆదివారం ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అలాగే ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సంస్థతో ఆయనకు సంబంధమున్నట్లు ఈడీ భావిస్తోంది. ఓ స్థిరాస్త అభివృద్ధి  ప్రాజెక్టులో ఈ సంస్థ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోను సచిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనకు నోటీసులు జారీచేసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, దీంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఆయన తెలుగులో మౌనమేలనోయి, నిను చూడక నేనేండలేను, నీ జతగా నేనుండాలి, ఒరేయ్ పండు, తదితర చిత్రాల్లో నటించారు. ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.