ఫాస్టాగ్ గ‌డువును పొడిగించే ప్రసక్తి లేదు 

వాహ‌నాల వినియోగ‌దారులు త‌క్ష‌ణం ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేన‌ని కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. ఇక ఎంత‌మాత్రం ఫాస్టాగ్ గ‌డువును ఇక ముందు పొడిగించేది లేద‌ని ఆదివారం స్ప‌ష్టం చేశారు. టోల్‌ప్లాజాల వ‌ద్ద ఈ-పేమెంట్ విధానం ఫాస్టాగ్ ప‌ద్ద‌తిలో టోల్ ఫీజు చెల్లింపును 2016లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది.

ఎల‌క్ట్రానిక్ పేమెంట్ ప‌ద్ద‌తి ఫాస్టాగ్‌లో టోల్ ఫీజు చెల్లించ‌డం వ‌ల్ల వాహ‌నాలు స్మూత్‌గా ముందుకు వెళ్లిపోతాయ‌ని, ట్రాఫిక్ జామ్ ఉండ‌బోద‌ని నితిన్ గ‌డ్క‌రీ పేర్కొన్నారు. ఇంత‌కుముందు ఫాస్టాగ్ గ‌డువును రెండు, మూడు సార్లు కేంద్రం పొడిగించింద‌ని, ఇక ఎంత‌మాత్రం పొడిగించబోద‌ని మీడియాతో అన్నారు. 

ఇప్ప‌టికే కొన్ని రూట్ల‌లో వాహ‌నాల ఫాస్టాగ్ రిజిస్ట్రేష‌న్ 90 శాతం పూర్త‌యింద‌ని, ప‌ది శాతం మాత్ర‌మే మిగిలి ఉంద‌ని నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. ఇంత‌కుముందు ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ వ‌ర‌కు ఉన్న ఫాస్టాగ్ రిజిస్ట్రేష‌న్ గడువును ఈ నెల 15 వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది.  

గడ్కరీ ప్రకటనతో టోల్ చెల్లింపులు సరళతరం చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం సోమవారం అర్థరాత్రి నుంచి తప్పనిసరి కానుంది.  ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులు అసలు టోల్ చార్జీకి రెండింతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. టోల్ గేట్ సిబ్బందికి చెల్లింపులు జరిపే పాత విధానాని ఫాస్ట్ ట్యాగ్‌ పద్ధతి ముగింపు పలకనుంది. ఫలితంగా టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అగత్యం తప్పి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగిపోతుంది. 

ఇప్పటికే ఫాస్టాగ్ లేని వాహనాలను సింగిల్ టోకెన్ విధానా న్ని మాత్రమే జారీ చేస్తున్నారు. గతంలో 24 గంటల్లో ఒకే టోల్‌ఫ్లాజా మీదుగా ప్రయాణించే వారికి రానుపోనూ చార్జీలను చెల్లిస్తే వారికి డిస్కౌంట్ వచ్చేది. ప్రస్తుతం ఆ విధానాన్ని కేంద్రం ఎత్తివేయడంతో ఫాస్టాగ్ లేని వారు సింగిల్ విధానంతో అధిక చార్జీలను చెల్లించేవారు.

వాస్తవానికి ఈ నిర్ణయం లాక్‌డౌన్ కంటే ముందే తీసుకున్నా దాని అమలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ఉపరిత ల రవాణా శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది. దీనిని కచితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించడంతో ప్రతి టోల్‌ఫ్లాజా వద్ద ఈ విధంగానే చార్జీలను వసూలు చేస్తున్నారు.

 వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ ఖరీదు వాహనంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను ఆన్‌లైన్‌ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు.