జమ్మూలో ఉగ్ర ప్రణాళికలు రట్టు చేసిన సైనికులు 

జమ్ములో ఉగ్రవాదులు మరోసారి బాంబు దాడికి ప్రణాళికలు సిద్ధం చేయగా భద్రతా దళాలు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీతో కూడిన బస్ స్టాండ్ సమీపంలో ఏడు కిలోగ్రాముల ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ) ను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా దాడి రెండో ఏడాది సందర్భంగా పేలుడు జరిపేందుకు ఈ ఐఈడీని ఉగ్రవాదులు పెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
ఈ ఐఈడీ నిర్దిష్ట సమాచారం మేరకు  పనిచేసేలా ఏర్పాటు చేసినట్లు భద్రతా సిబ్బంది చెప్పారు. సాంబా జిల్లాలోని జమ్ము, బారి బ్రాహ్మణ ప్రాంతంలోని కుంజ్‌వానీ నుంచి ఇద్దరు ఉగ్రవాదులను ఇటీవల అరెస్టు చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమ్ము బస్ స్టాండ్ సమీపంలో 7 కిలోల ఐఈడీని పాతినట్లు అరెస్ట్‌ అయిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పేలుడు పరికరాన్ని తొలగించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
గత ఏడాది దక్షిణ కశ్మీర్‌లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక పోలీసు హత్యకు సంబంధించి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాది జహూర్ అహ్మద్ రాథర్‌ను సాంబాలోని బారి బ్రాహ్మణ ప్రాంతంలో శనివారం అరెస్టు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 6 న జమ్ములోని కుంజ్వానీ ప్రాంతం నుంచి లష్కర్-ఏ-ముస్తఫా యొక్క సెల్ఫ్ స్టైల్‌ కమాండర్ హిదయతుల్లా మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్‌కు చెందిన టెర్రర్ గ్రూపు జైష్-ఏ-ముహమ్మద్‌కు చెందిన ఆత్మాహుతిదళం దాడిలో పేలుడు నిండిన వాహనాన్ని కశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనాల కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజుల తరువాత ఫిబ్రవరి 26 న పాకిస్తాన్‌లోని బాలకోట్ ప్రాంతంలో జైష్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం వైమానిక దాడులకు దిగింది.