గాల్వాన్‌ లోయలో త్వరలో పార్లమెంటరీ కమిటీ పర్యటన 

తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్‌ లోయ, ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ప్రాంతాల్లో రక్షణ రంగంపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ త్వరలో పర్యటించనుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన మే నెల చివరి వారంలో లేదా జూన్‌లో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. 

30 మంది సభ్యులు గల ఈ ప్యానెల్‌కు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి జువల్‌ ఓరం చైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్న ప్యానెల్‌ ఇటీవలి సమావేశానికి రాహుల్‌ హాజరుకాకపోవడం గమనార్హం. 

వాస్తవధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పర్యటించాలని ప్యానెల్‌ భావిస్తున్నందున.. ఇది ప్రభుత్వ ఆమోదం మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 

సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది గాల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత్‌, చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు దఫాల చర్చ అనంతరం దశలవారీ బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ కూడా గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.