రైతులతో సంప్రదింపులు ప్రారంభించిన `సుప్రీం’ కమిటీ 

సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం నుంచి రైతు సంఘాలతో తమ సంప్రదింపులను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 12 రైతు సంఘాలు, రైతులతో సంప్రదింపులు జరిపింది. ప్యానెల్ ఇప్పటివరకు నిర్వహించిన ఏడవ సమావేశం ఇది. ముగ్గురు సభ్యుల కమిటీ ఆన్‌లైన్‌లో, వ్యక్తిగతంగా వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నది.
రైతులు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలతో (ఎఫ్‌పీఓ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరస్పర చర్యలను నిర్వహించినట్లు కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీ సభ్యులతో సవివరమైన చర్చల్లో ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 12 వ్యవసాయ సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
 “నిపుణుల కమిటీ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాలు, ఉత్పత్తి సంస్థలు, రైతులు మూడు వ్యవసాయ చట్టాలపై తమ అభిప్రాయాలు, సలహాలను ఇచ్చారు” అని కమిటీ వెల్లడించింది. మూడు వ్యవసాయ చట్టాల అమలును జనవరి 12 న సుప్రీం కోర్టు రెండు నెలలపాటు నిలిపివేసింది.
వాటాదారులను సంప్రదించిన తరువాత రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీకి సూచించింది. దాంతో కమిటీ సభ్యులు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు.
కేంద్రం-41 రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం తేలలేదు. 18 నెలలపాటు చట్టాల అమలును నిలిపివేయడంతో పాటు రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తన చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు.