అబద్దాలు చెప్పవద్దు… కొత్త మేయర్ తో కేసీఆర్ 

అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు సూచించారు. హైదరాబాద్ నగర వాబిచ్చావాన్ని మరింతగా పెంచేందుకు పాటుపడాలని హితవు చెప్పారు. 

కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి కర్తవ్యబోధ చేశారు.

‘‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం’ అని పేర్కొన్నారు. 

‘‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి’ అని హెచ్చరించారు. 

మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలని పేర్కొన్నారు.