గాల్వన్‌ ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మృతి

భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లఢక్‌లోని గాల్వన్‌ లోయలో గత ఏడాది జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టీఏఎస్‌ఎస్‌ తెలిపింది. 2020 జూన్‌ 15న ఎల్‌ఏసీ వద్ద భారత్ ఆధీనంలోని ప్రాంతాల ఆక్రమణకు చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రయత్నించింది.
16వ బీహార్ పదాతిదళం బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్‌ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు ధీటుగా ప్రతిఘటించారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత్‌ స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది. కాగా, భారత్‌ జవాన్ల ప్రతిఘటనలో చైనాకు చెందిన సైనికులు 40 మందికిపైగా మరణించి ఉంటారని పలు విదేశీ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలను చైనా ఖండించింది. తమవైపు జరిగిన ప్రాణ నష్టం గురించి ఇప్పటికీ నోరు విప్పలేదు.
ఈ ఘర్షణ అనంతరం భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి.
చివరకు పది నెలల తర్వాత బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఉద్రిక్తతకు దారి తీసిన పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలోని ఫింగర్‌ 8 పశ్చిమ నుంచి 8 కిలోమీటర్ల మేర సైన్యాన్ని వెనక్కి మళ్లించేందుకు చైనా అంగీకరించింది. ఈ విషయాన్ని బుధవారం ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు భారత్‌ కూడా ఫింగర్‌ 8 నుంచి ఫింగర్ 3 వరకు బలగాలను వెనక్కి రప్పించేందుకు ఒప్పుకున్నది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ఈ విషయాన్ని పార్లమెంట్‌లో తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా న్యూస్‌ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్‌ ఘర్షణలో భారత్‌ 20 మంది సైనికులను కోల్పోగా చైనా 45 మంది సైనికులను కోల్పోయిందని పేర్కొంది.