విదేశాలలో కరోనాకు 2072 మంది భారతీయులు మృతి

కరోనాతో విదేశాలలో 2072మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు అందించారు. 

అత్యధికంగా 906 మంది భారతీయులు సౌదీ అరేబియాలో చనిపొయ్యారు. తరువాతి క్రమంలో యుఎఇలో 375 మంది వైరస్‌కాటుకు బలి అయ్యారు. కువైట్‌లో 369 మంది, ఒమన్‌లో 166 మంది మృతి చెందారు. గల్ఫ్‌దేశాలకు వెళ్లిన భారతీయులే ఎక్కువగా వైరస్‌కు గురి అయినట్లు ప్రభుత్వ సమాచారంతో స్పష్టం అయింది. 

దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మంది భారతీయులు గల్ఫ్‌లో వివిధ పనులకు వెళ్లి జీవిస్తున్నారు. వీరిలో లక్షలాది మంది కరోనా తీవ్రత దశలో తిరిగి స్వదేశం చేరకున్నారు. 

ఇటలీలో 15 మంది , ఫ్రాన్స్‌లో ఏడుగురు, నేపాల్‌లో తొమ్మిది మంది, ఇరాన్‌లో ఆరుగురు, ఇరాక్‌లో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. కరోనాతో అమెరికాలో ఎంత మంది భారతీయులు చనిపొయ్యారనే వివరాలు కేంద్రం నుంచి వెలువడ లేదు.