వాట్సాప్‌కు బదులుగా భారత్ యాప్ ‘సందేస్’  

వాట్సాప్‌కు బదులుగా భారత్ యాప్ ‘సందేస్’  
గ‌్లోబ‌ల్ సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌ల‌ను నియంత్రించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్రం ముందుకు వెళుతున్న‌ది. అందుకు సొంతంగా వాట్సాప్ యాప్‌కు సందేస్ పేరిట ప్ర‌త్యామ్నాయ యాప్  తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది.
ఇటీవ‌ల రైతుల ఆందోళ‌న‌పై ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో కొన్ని ఖాతాల‌ను కొన‌సాగించ‌డం, పోస్టుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో విస్త్రు`త ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికే అధికారిక స‌మాచారం మార్పిడి కోసం కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డెవ‌ల‌ప్ చేసిన సందేస్ యాప్‌ను వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ‘మేడిన్‌ ఇండియా’ వాట్సాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది.
సోష‌ల్ మీడియా సంస్థ‌లు విదేశాల‌కు చెందినవి కావ‌డంతో అధికారిక స‌మాచార మార్పిడి కోసం స్థానికంగా డెవ‌ల‌ప్ చేసిన సొల్యూష‌న్స్‌ను వినియోగించుకోవాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ది. దీన్ని నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ సెంట‌ర్ (ఎన్ఐసీ) డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది. సందేస్ పేరుతో ఉన్న ఓ మెసేజింగ్ యాప్‌ను ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు వాడుతున్నారు.
అయితే ఎన్ఐసీ అభివ్రుద్ధి చేసిన సందేస్ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో చోటు ద‌క్క‌లేదు. ఇప్ప‌టికే అందులో సందేశ్ అనే మ‌రో యాప్ ఇన్‌స్టాల్ అయి ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.  ప్ర‌స్తుతానికి అధికారిక స‌మాచారం కోసం వాడుతున్న ఈ సందేస్ యాప్ మున్ముందు సాధార‌ణ అవ‌స‌రాల‌కు ప్ర‌జ‌లు వాడేందుకు వినియోగిస్తార‌ని తెలుస్తున్నది.
గూగుల్ ప్లే స్టోర్ లో లేకున్నా.. ఎన్ఐసీ వారి సందేస్ యాప్‌.. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ పై ప‌ని చేస్తుంది. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో వ‌ర్క్ ఫ్రం హోం విధులు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు, అధికారులు, సిబ్బంది మ‌ధ్య స‌మాచార మార్పిడి కోసం దీన్ని డెవ‌ల‌ప్ చేశారు.
ఇంత‌కుముందు చైనాతో ల‌డ‌ఖ్ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో టిక్ టాక్ స‌హా ప‌లు చైనా యాప్‌ల‌పై కేంద్రం నిషేధం విధించింది. అవి పాపుల‌ర్ కావ‌డంతో ప్ర‌త్యామ్నాయ యాప్‌ల‌ను డెవ‌ల‌ప్ చేశారు కూడా. ఇటీవ‌ల రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీలు ట్వీట్లు చేయ‌డంతో కేంద్రం మండి ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా సందేస్ యాప్‌ను తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.