క్రూర చర్యల వల్ల జంతువు మరణిస్తే ఐదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.75 వేల జరిమానా విధిస్తారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే 60 సంవత్సరాల నాటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించనున్నది. సంబంధిత ముసాయిదాలో జంతువులపై నేరాలను మూడు వర్గాలుగా ప్రతిపాదించింది.
చిన్నగాయం, శాశ్వత వైకల్యానికి దారితీసే పెద్ద గాయం, క్రూరత్వం కారణంగా జంతువు మరణం కేటగిరీలుగా విభజించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాలో ఈ నేరాలకు వివిధ జరిమానాలు పేర్కొన్నారు. రూ.750 నుండి రూ.75,000 వరకు జరిమానాతోపాటు ఐదేండ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.
ప్రస్తుతం జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో వంద రూపాయల జరిమానా, మూడు నెలల జైలు లేదా ఆ రెండింటిని కలిపి విధించే అవకాశమున్నది.
ఇటీవల పలు ఏనుగులను కొందరు ఘోరంగా హింసించారని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించారు. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాంబులతో కూడిన పండ్లను తినిపించగా పేలుడుకు తీవ్రంగా గాయపడి అది మరణించిన విషయాన్ని సభకు తెలిపారు. జంతువులపై హింస, క్రూరత్వాన్ని నిరోధించడానికి ప్రస్తుత చట్టాన్ని సవరించాలని ప్రశ్నోత్తరాల్లో అడిగారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ప్రశ్నకు స్పందించి ఈ నెల 5న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960ను సవరించి మరింత కఠినమైన జరిమానాలు, శిక్షలు విధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. సవరణ ముసాయిదాలో జరిమానాలు, జైలు శిక్షలను పెంచే నిబంధనలు చేర్చినట్లు వెల్లడించారు.
మరోవైపు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 316 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మరో ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటుకు తెలిపింది. ఇలాంటి 64 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, 38 కేసులు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నట్లు పేర్కొంది.
More Stories
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- 8 మంది మృతి
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్