
ముందుగా నిర్ణయించిన మార్గాన్ని అతిక్రమించారని ఆరోపిస్తూ బీజేపీ రథయాత్రను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు సమీపంలోని బెల్దంగ ప్రాంతంలో పోలీసులు నిలిపివేశారు. రథయాత్ర వేరే మార్గంలో వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే ఆందోళనతో పోలీసులు యాత్రను నిలువరించారు.
జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లోకి వెళ్లకుండా పోలీసులు రథయాత్రను నిలిపివేశారని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు రథయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రూట్ మ్యాప్‌పై తాము ముందుగానే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందించగా అప్పుడు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని ముర్షిదాబాద్ బీజేపీ నేత గౌరీశంకర్ ఘోష్ చెప్పారు. యాత్ర మార్గం ఖరారు చేసేముందు తాము పోలీసులతో సంప్రదింపులు జరిపామని, అనూహ్యంగా బెల్దంగ ప్రాంతంలో పోలీసులు యాత్రను అడ్డుకోవడంతో విస్మయానికి గురయ్యామని రాష్ట్ర బీజేపీ నేత కళ్యాణ్ చౌబే విమర్శించారు.
పోలీసుల అభ్యంతరంతో మూడు గంటలు నిరీక్షించిన తర్వాత తాము జాతీయ రహదారి మీదుగా యాత్రను దారిమళ్లించామని చెప్పారు.బీజేపీ పరివర్తన యాత్రను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 6న నదియా జిల్లా నవద్వీప్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాష్ట్రాన్ని చుట్టివచ్చేందుకు బీజేపీ బెంగాల్ నలుమూలలా రథయాత్రలను చేపట్టింది.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
మణిపూర్లో శాంతి పునరుద్ధరణలో పురోగతి